పొట్టి ఫార్మాట్ లో టీం ఇండియా బ్యాటింగ్ మెషిన్ కెప్టెన్సీ యుగం ముగిసింది. బ్యాటింగ్ లో కోహ్లీకి తిరుగు లేకపోయినా కెప్టెన్ గా మాత్రం అతని ప్రదర్శన ఇబ్బందికరంగానే ఉంది. సాధారణంగా భారత్ లాంటి పటిష్ట జట్ల విషయంలో ఐసిసి ట్రోఫీ గెలిస్తే మత్రమే అతన్ని విజయవంతమైన కెప్టెన్ గా గుర్తించే పరిస్థితి ఉంటుంది అనే మాట వాస్తవం. భారత మాజీ కెప్టెన్ గంగూలీని ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా సరే విజయవంతమైన కెప్టెన్ గా చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. మాజీ కెప్టెన్ ధోనీ లాంటి ఆటగాడిని టీం ఇండియాకు అందించాడు.
ధోనీ కూడా ఐసిసి ట్రోఫీ గెలవడం, టెస్ట్ లలో నెంబర్ వన్ జట్టుగా భారత జట్టుని నిలపడం వంటివి చేసాడు కాబట్టి అతన్ని విజయవంతమైన కెప్టెన్ గా అభిమానులు చెప్తూ ఉంటారు. అయితే కోహ్లీ విషయానికి వస్తే… ఏ మెగా టోర్నీలో కూడా కోహ్లీ ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. ఐపిఎల్ లో కూడా కోహ్లీ కెప్టెన్ గా విజయవంతం కాలేదు. జట్టు పటిష్టంగా ఉన్నా సరే అతనిలో ఉన్న కొన్ని లోపాల కారణంగా, కీలక ఆటగాళ్ళ ప్రదర్శన కారణంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.
అయితే ఇప్పుడు టీం ఇండియా నూతన పొట్టి ఫార్మాట్ క్రికెటర్ గా రోహిత్ శర్మ వైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపుతుంది. టీం ఇండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా అతని వైపే ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. కాని ద్రావిడ్ ఆలోచన మరోలా ఉందనే టాక్ నడుస్తుంది. పొట్టి ఫార్మాట్ కెప్టెన్ గా కెఎల్ రాహుల్ వైపే అతను ఆసక్తి చూపిస్తున్నాడని జట్టు వర్గాలు అంటున్నాయి. ఐపిఎల్ లో అతను పంజాబ్ జట్టుని నడిపించిన విధానం ద్రావిడ్ కి చాలా బాగా నచ్చింది అనే టాక్ ఉంది.
వచ్చే కివీస్ పర్యటనకు ద్రావిడ్… కెఎల్ రాహుల్ ని వైస్ కెప్టెన్ గా నియమించే విధంగా ప్లాన్ చేస్తున్నాడని… ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ కు పూర్తి స్థాయి కెప్టెన్ గా రాహుల్ ని ప్రకటించే అవకాశం ఉందనే మాట వినపడుతుంది. యువ ఆటగాళ్ళు చాలా మంది రాహుల్ తో సన్నిహితంగానే ఉంటారు. సీనియర్ లు రోహిత్ శర్మ, జడేజా, శమి నుంచి కూడా అతనికి సపోర్ట్ ఉంది. కాబట్టి అతను అయితేనే బాగుంటుంది అనే భావనలో ద్రావిడ్ ఉన్నాడని, ఇప్పుడు రోహిత్ ని నియమించినా సరే అతనికి వయసు మీద పడుతుంది కాబట్టి తర్వాత తర్వాత ఇబ్బందవుతుందనే భావనలో ఉన్నాడని టాక్.