అందరూ అనుకున్నట్టే టీం ఇండియా టి 20 కెప్టెన్ గా ఓపెనర్ రోహిత్ శర్మను భారత జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. స్వదేశంలో జరిగే కివీస్ సీరీస్ కు గానూ నేడు టీం ఇండియాను ప్రకటించిన సెలెక్షన్ కమిటీ యువకులకు ప్రాధాన్యత కల్పిస్తూ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అలాగే సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బూమ్రాలకు విశ్రాంతి ఇచ్చింది. ఇక పేలవ ప్రదర్శనతో జట్టుకి భారంగా మారిన యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టేసింది టీం యాజమాన్యం. బౌలింగ్ విభాగం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఐపిఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంది.
సీనియర్ బౌలర్ మహ్మద్ శమీని కూడా పక్కన పెట్టారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటారు. ఇక చెన్నై యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, కలకత్తా ఆటగాడు వెంకటేష్ అయ్యర్, ఢిల్లీ ఆటగాడు ఆవేశ్ ఖాన్, బెంగళూరు జట్టు ఆటగాడు హర్షల్ పటేల్ ను తొలిసారి జాతీయ జట్టుకి ఎంపిక చేసారు. ఇక సీనియర్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ ఆర్ అశ్విన్ బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తారు. జట్టుకి కొన్ని రోజుల నుంచి దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ ను కూడా ఎంపిక చేసారు.
వారితో పాటుగా సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రిశబ్ పంత్, తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే రాహుల్ చహార్ ని పక్కన పెట్టి దీపక్ చాహర్ ను ఎంపిక చేసారు. అయితే ద్రావిడ్ సూచనలతోనే టీం ఎంపిక జరిగింది అనేది క్లియర్ గా అర్ధమవుతుంది. ముందుగా అనుకున్నట్టే రోహిత్ కెప్టెన్, కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ కాగా… ఐపిఎల్ లో నిలకడగా, దేశవాళి క్రికెట్ లో నిలకడగా రాణించిన యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్, ఆవేశ్ ఖాన్ ఎంపిక విషయంలో ఇదే జరిగింది. వీళ్ళు నలుగురు ఐపిఎల్ లో విశేషంగా రాణించారు. గైక్వాడ్ ఆట తీరే చెన్నై జట్టుకి కప్ అందించిందనే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ నలుగురు ద్రావిడ్ దగ్గర శిక్షణ తీసుకున్న ఆటగాళ్లే కావడం విశేషం. అండర్ 19 నుంచి కూడా ద్రావిడ్ శిక్షణలో ఉన్నారు. ఇండియా ఏ జట్టులో కూడా ఉన్నారు.