భారత జట్టులో కీలక మార్పులకు సమయం ఆసన్నమైందా…? గత కొన్ని రోజులుగా జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను యాజమాన్యం పక్కన పెట్టె అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. టీం ఇండియా కోచ్ గా ద్రావిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలోనే భారత జట్టులోకి కొత్తగా నలుగురు యువ ఆటగాళ్ళు వచ్చి చేరారు.
కివీస్ సీరీస్ కోసం వెంకటేష్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్ ని ఎంపిక చేసారు. ఇక ఇప్పుడు టెస్ట్ జట్టులో కూడా కీలక మార్పులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. టి 20 కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించిన సెలెక్షన్ కమిటీ టెస్ట్ జట్టులో కూడా అతనికి కీలక బాధ్యతలు అప్పగించే యోచన చేస్తుంది. వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ ఇవ్వాలని యాజమాన్యం భావిస్తుంది.
జట్టులో కొన్ని రోజులుగా ప్రభావం చూపించని సీనియర్ ఆటగాళ్ళు చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేని పక్కన పెట్టాలని భావిస్తున్నారు. పుజారా స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను తుది జట్టులోకి తీసుకోవాలని లేదా మయాంక్ అగర్వాల్ ను పూర్తి స్థాయిలో జట్టులో ఉంచాలని భావిస్తున్నారు. ఇక రహనే స్థానంలో కొత్త ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్ శర్మకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది అని మీడియా వర్గాలు అంటున్నాయి. సఫారి పర్యటనలో టీం సీరీస్ కోల్పోతే మాత్రం కోహ్లీని కూడా కెప్టెన్ గా పక్కన పెట్టె అవకాశం ఉందని భారత జట్టు వర్గాలు అంటున్నాయి. బీసీసీఐ దీని మీద కసరత్తు చేస్తుందని సమాచారం.