ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో ఉంటుంది. క్రికెట్ మీద అభిమానం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ మ్యాచ్ కోసం చూస్తారు అనే మాట వాస్తవం. అయితే ప్రపంచకప్ టోర్నీలలో మాత్రం ఇండియా పై ఎప్పుడూ కూడా పాకిస్తాన్ గెలవలేదు. ఆ జట్టు తరుపున దిగ్గజ ఆటగాళ్ళు ఉన్నా సరే… ఎప్పుడూ కూడా ఇండియానే పైచేయి సాధించింది. మన దేశానికి ఎలా అయినా గెలుస్తామనే ధీమా ఉంటే వాళ్లకు ఎలా గెలవాలనే భయం ఉంటుంది.
అయితే నిన్నటి మ్యాచ్ దెబ్బకు అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయి. పాకిస్తాన్ ఆడిన ఆట చూసి మన వాళ్లకు మైండ్ పోయింది. మన వాళ్ళు ఏడు వికెట్లు కోల్పోయి నానా కష్టాలు పడి సాధించిన స్కోర్ వాళ్ళు వికెట్ పడకుండా బాదేసారు. మన వాళ్ళు ఓడిపోయిన దానికంటే పాకిస్తాన్ పది వికెట్లతో గెలవడమే బాధగా ఉంది చాలా మందికి. పటిష్ట టీం తో అడుగు పెట్టినా సరే టీం ఇండియాకు మైండ్ పోయిననంత పని అయింది. చాలా వరకు కూడా టీం ఇండియాపై పాకిస్తాన్ జట్టే పై చేయి సాధించింది. అసలు ఈ మ్యాచ్ లో ఇండియా ఎక్కడ ఫెయిల్ అయిందో చూద్దాం…
టాస్ ఓడిపోవడం: ఒకరకంగా పాకిస్తాన్ కు దుబాయ్ సెకండ్ హోం గ్రౌండ్. కాబట్టి అక్కడ పిచ్ ఎలా స్పందిస్తుంది ఏంటీ అనేది ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి టాస్ గెలిచిన వెంటనే పాకిస్తాన్ జట్టు మరో ఆలోచన లేకుండా బౌలింగ్ కి వెళ్ళింది. బాబర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాక్ బౌలర్లు చెలరేగిపోయారు. వికెట్ టూ వికెట్ బంతులు వేస్తూ… చక్కటి స్వింగ్ రాబడుతూ తమ సత్తా చాటారు. ఐపిఎల్ లో కూడా ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించడం కూడా మనం చూసాం. టాస్ ఓడిపోవడం అనేది ఇండియాకు మైనస్ అయింది.
ఓపెనర్లు అవుట్: టీం ఇండియా ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఏ రేంజ్ లో ఆడతారో మనం చూసాం. కాని ఈ మ్యాచ్ లో పాక్ పేసర్ షాహిన్ అఫ్రిదీ కి దాసోహం అన్నారు. అతను వేసే స్వింగ్ ని అంచనా వేయలేక వికెట్ లు పారేసుకున్నారు. కనీసం వీళ్ళు ఇద్దరూ చెరో ముప్పై పరుగులు చేసినా టీం ఇండియా 200 స్కోర్ చేసి ఉండేది. పాక్ ఒత్తిడిలో ఉండే అవకాశం ఉండేది.
కీలక సమయాల్లో వికెట్ లు కోల్పోవడం: టీం ఇండియాలోకి కొత్తగా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేసే కమంలో వికెట్ కోల్పోయాడు. కుదురుకున్నాడు అనుకున్న పంత్ అనవసర షాట్ కు వికెట్ పారేసుకున్నాడు. ఇక జడేజా భారీ షాట్ లు ఆడే సమయంలో… బంతిని అంచనా వేయలేక వికెట్ పారేసుకున్నాడు. కీలక సమయంలో కోహ్లీ, పాండ్యా అవుట్ కావడం జట్టుకి పెద్ద మైనస్ అయింది.
భారత్ లైట్ తీసుకోవడం: పాకిస్తాన్ జట్టుని గతంలో మాదిరిగా అంచనా వేయడం, అందులో ఉన్న ఆటగాళ్లను తక్కువ అంచనా వేసుకోవడం బాగా మైనస్ అయింది. ఐపిఎల్ లో దుబాయ్ లో ఆడినా సరే పిచ్ గురించి అవగాహన లేకపోవడం బాగా ఇబ్బంది పెట్టింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డులు అన్నీ జింబాబ్వే మీద ఉండటం తో అతను ఆడలేరు అనుకుని తక్కువ అంచనా వేసారు.
బాబర్ పై ఒత్తిడి: ప్రపంచ కప్ లో ఎలా అయినా సరే గెలవాలని, భారత్ ను ఓడించాలి అనే ఒత్తిడి ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం పై మాజీ ఆటగాళ్ళు, ఆ జట్టు యాజమాన్యం నుంచి బాగా ఒత్తిడి ఉందనే వార్తలు వచ్చాయి. దీనితో బాబర్ కూడా మ్యాచ్ కోసం ఇంజిమాం సలహాలతో బరిలోకి దిగాడు.
పాక్ ఆట తీరు: పాక్ ఆట తీరులో చాలా మార్పు కనపడింది. ప్రతీ ఒక్కరూ కసిగా ఆడారు. వికెట్ లు తీసే వాళ్ళు వికెట్ లు తీస్తే పరుగులు కట్టడి చేసే వాళ్ళు చాలా సమర్ధవంతంగా చేసారు. పాక్ బౌలర్లలో ఒక్కరి ఎకానమీ కూడా 8 దాటలేదు అంటే వాళ్ళు ఎంత పక్కాగా బంతులు విసిరారో అర్ధం చేసుకోవచ్చు. ఇక బ్యాటింగ్ విషయంలో కూడా… బాబర్, రిజ్వాన్ ఇద్దరూ చాలా పక్కాగా షాట్ లు ఆడారు. ముందు కంగారు పడినా క్రీజ్ లో నిలబడిన తర్వాత స్వేచ్చగా ఆడారు.
హిట్టింగ్ చేయలేకపోవడం: ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత ఒక్క పంత్ మినహా దాదాపు అందరూ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. విరాట్ కోహ్లీ అప్పుడప్పుడు షాట్ లు ఆడాడు. హిట్టింగ్ చేసే క్రమంలో తక్కువ అంచనా వేసుకుని ఆడిన షాట్ లతో జడేజా, పాండ్యా అవుట్ అయ్యారు.
బౌలింగ్ లోపాలు: సీనియర్ లు భువీ, శమీ ఉన్నా సరే పాక్ పై ఒత్తిడి తీసుకురాలేదు. వాళ్ళు శమీ బౌలింగ్ ని ఒక ఆట ఆడుకున్నారు. భూమ్రా కాస్త మెరుగ్గా కనిపించగా జడేజా వికెట్ తీయకపోయినా పరుగులు కట్టడి చేసాడు. వరుణ్ చక్రవర్తి ముందు కట్టడి చేసినా తర్వాత పట్టు కోల్పోయాడు.
రన్ అవుట్ చాన్స్ లు మిస్ చేసుకోవడం: బౌండరీలు బాదే ప్రయత్నం చేయడంతో కోహ్లీ ఫీల్డర్ లను బౌండరీ వద్ద ఎక్కువగా మోహరించాడు. దీనితో పాక్ డబుల్స్ ఎక్కువ తీసింది. ఇక కీలక రన్ అవుట్ లు చేసే అవకాశం వచ్చినా సరే ఆలస్యంగా బంతి విసరడం పెద్ద మైనస్ అయింది. బౌండరీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా బంతి… స్టంప్స్ ని టార్గెట్ చేసి విసరలేదు. జడేజా, కోహ్లీ మాత్రమే చురుగ్గా కనిపించారు.